యజ్ఞవరాహస్వామి జయంతి నేడు, స్మరించుకుని తరిద్దాం - చీమల పాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నేడు యజ్ఞవరాహస్వామి జయంతి.
బ్రహ్మగారి మనస్సునుంచి సృష్టికోసం సనకసనందనాదులు, నారదమహర్షి వంటివారు పుట్టుకొచ్చారు కాని వారు నివృత్తి మార్గంని అనుసరించడంతో మళ్ళీ సృష్టి కోసమని ప్రజాపతులు, మహర్షులు ఉద్భవించారు. వారి వలన సత్యతపోలోకాలు వంటి ఊర్ధ్వలోకాలు దేవతలు మొ.గు వారితో నిండి ఉన్నాయి.
ఇక భూలోకంలో కూడా సృష్టి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మ. ఆయన ధ్యానంలో ఉండగా ఆయన నుంచి శతరూప స్వయంభు మనువులు ఉద్భవించారు. వీరు ప్రధమ మిధునం ( జంట ). వీరిని సృష్టి మొదలు పెట్టండి అంటే " ఎక్కడ " అని అడిగారు. భూమిమీద అన్నారు బ్రహ్మ. భూమి ఎక్కడుంది అని అడిగారు వారు.
భూమి లేదు అక్కడ. హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని నీటిలోపలికి వెళ్ళి పోయాడు.
ఇక్కడ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుత విషయం తెలియచేసారు. హిరణ్యాక్షుడు ఒక శాస్త్రజ్ఞుడు. భూమిని ఎత్తుకు పోయాడు అంటే భూమిని తన నిర్ణీతకక్ష్యనుంచి తప్పించాడు అని తెలుసుకోవాలి అన్నారు. అది అసురలక్షణం, ప్రకృతి విరుద్ధం, సృష్టిని అడ్డుకోవడానికి చేసిన పని.
భూమి రక్షణకోసం బ్రహ్మ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన నాశికలోనుంచి బ్రొటకనవ్రేలు పరిమాణంతో వరాహస్వామి అవతరించారు. క్షణాలలో ఏనుగంత అయి
గర్ఘరధ్వని చేసారు. వరాహగర్జనని గర్ఘరం అంటారు. బ్రహ్మ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వరాహమూర్తి బ్రహ్మ వలన రాలేదు, బ్రహ్మ లోంచి వచ్చారు ఆయనకు తెలియకుండా. తను ధ్యానం చేసిన యజ్ఞభగవానుడే ఈయనా అని ఆశ్చర్యపోయారు బ్రహ్మ. యజ్ఞభగవానుడి రూపం కనుక యజ్ఞవరాహమూర్తిగా పూజింపబడుతున్నారు స్వామి. దేవతలు ఋషులు అందరూ సత్యలోకానికి వచ్చి స్వామిని ఆశ్చర్యంగా చూస్తున్నారుట. స్వామి అలా అలా పెరిగి పోయారు.
స్వామి భయంకరమైన కోరలతో ఉగ్రంగా ఉన్నా ఎంతో ప్రసన్నంగా చూస్తున్నారుట అక్కడి వారినందరినీ.
వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షించారు ( నిర్ణీత కక్ష్యలో ఉంచారు మళ్ళీ ).
హరివంశం, విష్ణు పురాణం వరాహస్వామి రూపాన్ని అద్భుతంగా వర్ణించాయి.
హరివంశం స్వామిని ఇలా వర్ణించింది:
" వేదపాదో యూపదంష్ట్రః క్రతుహస్తః.......".
" వేదాలు పాదాలుగా, యూపస్తంభాలే కోరలుగా, క్రతులు చేతులుగా, చితులు ( యజ్ఞం లోని నిత్యాగ్నులు ) ముఖంగా, అగ్నులు నాలుకగా, దర్భలు రోమాలుగా, బ్రహ్మ శిరస్సు గా ( బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, యజ్ఞంలో బ్రహ్మ ), అహోరాత్రులు కన్నులుగా, వేదాంగములు కర్ణాభరణములుగా, సామవేదఘోష ధ్వనిగా, ప్రాయశ్చిత్తకర్మలు గోళ్ళుగా, సోమరసం రక్తంగా, దక్షిణ హృదయంగా, యజ్ఞవేదిక వీపుగా, హవిస్సు గంధంగా, వేద ఛందస్సు మార్గాలుగా ......" - అలా ఆవిర్భావించారు స్వామి.
" యజ్ఞోవై విష్ణుః " అంది వేదం. సృష్టి అంతా యజ్ఞమే. స్వామి యజ్ఞవరాహస్వామి.
స్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని మళ్ళీ యథాస్థితిలో ఉంచకపోతే భూమిమీద సృష్టీ లేదు, మనమూ లేము.
వరాహస్వామి జయంతి శుభాకాంక్షలు అందరికీ. స్వామిని స్మరించుకుని తరిద్దాం.
శుభమస్తు.
Comments
Post a Comment