నేను వేరు, నాలోని ఆత్మ వేరు అని తెలుసుకున్నవారు జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ

 శ్రీమాత్రేనమః వివిక్తస్థా 835


" వివిక్తస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 835 వ నామం .

" వివిక్తస్థా " అంటే ' అత్మ అనాత్మ ' అనే వివేకం కలవారియందు ఉండునది. అంటే శాశ్వతమయిన ఆత్మ గురించి క్షుణ్ణంగా తెలిసిన వారి యందు ఉంటారు అమ్మవారు.

కఠోపనిషత్తు ఈ ఆత్మ, ఆత్మవిద్య గురించి విస్తారంగా ప్రస్తుతించింది.

మనం అందరం శాశ్వతమయిన ఆత్మను, అశాశ్వతమయిన శరీరాన్ని కలిపేస్తాం. అశాశ్వతమయిన ఆస్తులు, బంధాలూ అన్నీ " నావి " అనుకుంటూ నేను ( ఆత్మ ) కు ఆపాదిస్తాం.

మరి ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలి?

" నైషా తర్కేణ మతిరాపనేయా (1.2.9)" -  ఆత్మవిద్య తర్కంతో పొందరానిది.  ఆత్మవిద్య తర్కానికి అతీతం గనుక గురువు అనుగ్రహంతోనే లభిస్తుంది.‌ ఆత్మవిద్య బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే ఉపదేశించగలడు అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు.

ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలిగితేనే అంతరాత్మను చూడగలం అని చెబుతూంది ఈ ఉపనిషత్తు:

" పరాంఛి ఖాని వ్యయత్రుణత్స్వయంభూః
  తస్మాత్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్
  కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్ష
  దావృత్తచక్షురమృతత్వమిచ్చన్ " (2.1.1)

" ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించే విధంగా భగవంతుడు సృష్టించాడు. అందువలన అవి అంతరాత్మను చూడలేక పోతున్నాయి.  ధీరుడైన వాడు వాటిని నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శించుకుంటున్నాడు " అని.

ఆశ్చర్యకరంగా వేదశాస్త్రాలు చదవడం వల్ల ఆత్మ తెలియదు, సాధన ద్వారానే తెలియబడుతుంది అంది ఈ ఉపనిషత్తు. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస వంటివారు ఈ కోవలోకి వస్తారు.

ఓ గమ్యాన్ని చేరడానికి ఓ వాహనం ఎక్కుతారు. గమ్యం చేరుకున్నా, గమ్యం చేరేలోపు వాహనం ( శరీరం) పాడయిపోయినా ఆ వాహనాన్ని వదిలేసి  ఎదరకు సాగుతారు. ఈ శరీరం వాహనం వంటిదే. దానిలో ప్రయాణించే ఆత్మ వేరు. ఇది తెలుసుకున్న వారు జ్ఞానులు. వారిలో అమ్మవారు స్థితులై ఉంటారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ