అక్షయతృతీయ నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏


అశ్వదాయి చ గోదాయి
ధనదాయి మహాధనే
ధనం మే జుషతాం దేవి
సర్వకామార్థ సిద్ధయే " - శ్రీసూక్తం

అమ్మవారు లక్ష్మీదేవిని " అశ్వాలు, గోవులు, ధనం సమృద్ధిగా అనుగ్రహించు తల్లీ " అని ప్రార్ధిస్తాం శ్రీసూక్తంలో.

అశ్వం అంటే  వేగంగా ప్రయాణించునది అని తెలియచేస్తూంది వేదం. అందుకని గుర్రం అని కాకుండా వాహనం అని భావించాలి.

గోవుకి నానార్ధాలు చాలా ఉన్నాయి. వాటిలో భూమి అని ఒక అర్థం. అందుకని భూసంపద ప్రసాదించమని అర్ధం.

వాహనం, భూసంపద, ధనం సమృద్ధిగా ఇవ్వమని ప్రార్ధన.

మత్స్య పురాణంలో శివుడు పార్వతికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించారు. వైశాఖ శుద్ధ తదియనాడు ఏ వ్రతం, జపం, హోమం, పూజ చేసినా అక్షయ ఫలం ఇస్తుంది అని. అక్షయం అంటే తరుగులేనిది అని. అందుకే ఏ ఆశీర్వచనంలో అయినా " అక్షయం ఉపతిష్టతు " అని ఉంటుంది.

నారద పురాణంలో కూడా ఈ వ్రతం గురించి విస్తారంగా తెలియచేసారు.

గరుడపురాణంలో శ్రీమహావిష్ణువు గరుడునికి " అక్షయదేవలోకాలున్నట్లే అక్షయనరకాలు కూడా ఉన్నాయి. నరకాలలో అనేక శిక్షలు అనుభవించిన తరువాత కూడా పాపులకు నీచజన్మలే లభిస్తాయి. అందుకే మనుష్య జన్మ లభించినప్పుడు జాగ్రత్త పడాలి. పాపరతి నుంచి మనస్సును ప్రక్కకు త్రిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి " అని తెలియచేసారు. కొద్దిగా ప్రక్కకు మనస్సును త్రిప్పగలిగితే పట్టుకోవడానికి అక్కడ హరి తయారుగా ఉంటారు. ఆయన పట్టుకున్న తరువాత యమభయం, నరకభయం రెండూ ఉండవు కదా.

ఇక్కడ " ప్రయత్నం చేస్తూ ఉండాలి " అన్నారు. చెయ్యి అనలేదు. చేస్తే బాగుపడుతావు, లేకపోతే బాధలు అనుభవిస్తావు అని భావం. మన బాగోగులకు మనమే ప్రయత్నాలు చేసుకోవాలి.

నరకబాధలు పడతావు అని భయపెడుతూనే నువ్వు ప్రయత్నం చేస్తే " పట్టుకోవడానికి నేనున్నాను " అని అభయం కూడా ఇచ్చారు విష్ణువు.

ఈరోజు విష్ణువు ఆరాధన, నామస్మరణ విశేష ఫలితాన్నిస్తుంది.

ఈరోజే ధర్మసంస్థాపనార్ధం పరశురాముడిగా విష్ణువు అవతారం తీసుకున్నది.

ఈరోజే వ్యాసమహర్షి మహాభారతం రచనకు శ్రీకారం చుట్టారు. అద్భుతమయిన ఇతిహాసంని అందించారు మనకు.

ఈరోజే సింహాచలం శ్రీవరాహనృసింహస్వామి చందనోత్సవం.

ఇక్కడో ధర్మసూక్ష్మం ఉంది. మంచి పనులకు మంచి ఫలితం ఎలా అక్షయంగా కలుగుతుందో చెడుపనులకు కూడా చెడు ఫలితం అక్షయంగానే కలుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఈరోజు. మంచిపనులు చేయకపోయినా నష్టం లేదు కాని చెడుపనులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.

అమ్మవారు పరీక్షలు బాగా పెడతారు అనుగ్రహించే ముందు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభమస్తు 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ