ధీరులు, నిరపేక్షులు, స్వాత్మారాములకు అమ్మవారి జపం తప్ప వేరే ధ్యాస ఏమీ ఉండదు, అటువంటి వారిది బ్రహ్మానందస్థితి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" స్వాత్మారామా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 878 వ నామం.
" స్వాత్మారామా " అంటే తన ఆత్మయందే తను క్రీడించడం. క్రీడ అంటే ఆనందం.
ఇంద్రియాలను పరమాత్మవైపు పయనింప చేయడం, ఆత్మను గుర్తించడం చేస్తే జీవితమునకు సార్ధకత. అశాశ్వతమైన ప్రకృతి విషయాలవైపు సాగుతే జీవితం వ్యర్ధం.
వేదం " విశ్వేదేవాః సమనసః సకేతా ఏకం క్రతుం అభిబియంతు సాధు " అని తెలియచేస్తూంది - ఒకటే పని - అది పరమాత్మను తెలుసుకోవడం. విశ్వేదేవాః అంటే ఇంద్రియాలు.
యోగులు, మహాత్ములు అంటారు " పరమాత్మ మనలోనే ఎందుకు ఉన్నాడంటే దగ్గరగా ఉంటే ఎప్పటికయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని. అదే దూరంగా ఉంటే బద్ధకిస్తామేమో " అని. ఎంతటి కరుణామయుడు.
అన్నమయ్య " మొదలుండ కొనలకు మోచి నీళ్ళు పోయనేల, ఎదలో నీవుండ ఇతరములేల " అంటారు.
కఠోపనిషత్తు " జీవుడి హృదయంలో తన బొటనవ్రేలు ప్రమాణంలో ఉంటారు పరమాత్మ " అని తెలియచేస్తూంది. ఎవరి వ్రేలు ప్రమాణం వారిదే. ఎంత అద్భుతం.
హృదయంలో పద్మం మొగ్గలా ఉంటారు పరమాత్మ. సాధనచేసేకొలదీ మొగ్గ విచ్చుకుని పద్మంలా అవుతుంది. కంచి పరమాచార్య, రమణమహర్షి, రామకృష్ణ పరమహంస మొ.గువారు నిరంతర సాధనతో ఆ స్థితికి చేరారు.
రమణమహర్షి " అరుణాచల పరమాత్మన్ అరుణోభవ, చిత్తకంజ సువికాశాయ " అంటారు. " మా మనస్సు మొగ్గలా ముడుచుకుపోయింది. నీ కరుణ అనే అరుణకిరణాలను ప్రసరించి అది విచ్చుకునేలా చెయ్యి తండ్రీ ( సూర్యకిరణాలు సోకితే పద్మం వికసిస్తుంది ) " అని ప్రార్ధిస్తారు. కారణజన్ములు.
" ధీరులు నిరపేక్షులు
నాత్మారాములునైన
మునులు హరిభజనము
నిష్కారణమ
చేయుచుందురు
నారాయణుఁ డట్టివాఁడు
నవ్య చరిత్రా "
- పోతనభాగవతం.
పోతనగారు భాగవతం వ్రాస్తూన్నప్పుడు " అలవైకుంఠపురంబులో..... " అనే పద్యం రాముడు స్వయంగా వచ్చి వ్రాస్తారు. తులసీదాసు రామాయణం వ్రాసినప్పుడు హనుమ ప్రక్కన కూర్చుని సందేహం వస్తే తీరుస్తూ ఉండేవారుట.
అటువంటి వారికి వేరే వ్యాపకమే ఉండదు, హరినామస్మరణ తప్ప. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామజపం చేసారు, పుణ్యపురుషులు.
కొంచెం కష్టమే అయినా సాధన చేయగా చేయగా ఆ స్థితి కలుగుతుంది, అలవాటు అయిపోతుంది. ఏపని చేసుకుంటూ ఉన్నా లోపల రామనామజపం జరిగిపోతూ ఉంటుంది. ఏ కర్మ చేసినా పరదేవతార్పణం అయిపోతుంది. దానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Wonderful guruvu gaaru
ReplyDeletePl mention ur name n mobile number after comment
ReplyDelete