మనం మనలా ఉండేలా సాధనచేస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" స్వస్థా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 914 వ నామం.
" స్వస్తి " అంటే క్షేమం/శుభం అన్నారు కాని అసలు అర్ధం చూద్దాం. " స్వస్థా" అన్నది అమ్మవారి ఒక నామం. స్వ+స్థ = తను + ఉండడం. అంటే తను తనుగా ఉండడం.
ఎవరైనా సరిగ్గాలేరనిపిస్తే " ఏం అలా ఉన్నావు " అంటాం. అతను ఒంట్లో బావుండలేదనో, మనస్సు బావుండలేదనో అంటారు.
అంటే శరీరం కాని మనస్సు కాని సరిగ్గా లేకపోతే తను తనుగా ఉండడు/ఉండలేడు. అటువంటి స్థితిలోనే చెడు ఆలోచనలు కలగడం చెడుపనులు చేయడం జరుగుతుంది. జీవుడు పతనమవుతాడు.
అమ్మవారు ఈ రెండూ సరిగ్గా ఉండేలా అనుగ్రహిస్తారు. అంటే క్షేమాన్ని యోగాన్ని కలిగిస్తారు.
" స్వస్థా " అంటే మంగళకరమైన ఉత్తర గతులను కలిగించునది అని ఒక భాష్యం చెప్పారు భాస్కరరాయలవారు. అమ్మవారు తనను నమ్ముకున్నవారిని " ఉన్నస్థితినుంచి ఉన్నతస్థితికి తీసుకుని వెడుతారు. అది జీవుడు తను తనుగా ఉన్నప్పుడే సాధ్యం. ఆత్మన్యూనత ( నిరాశ ) తో దిగజారిపోయినప్పుడు కుదరదు. ఆ స్వస్థతను అమ్మవారు కలిగిస్తారు.
" అనిర్వేదశ్శ్రేయోమూలం
అనిర్వేదః పరంసుఖం
అనిర్వేదోహి సతతం
సర్వార్ధేషు ప్రవర్తకః "
ఉత్సాహమే సర్వసంపదలకు, సుఖాలకు మూలం. సదా ఉత్సాహంగా ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి అన్నారు హనుమ సుందరకాండలో.
" స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి
స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః "
- విష్ణుసహస్రనామం.
అమ్మవారి పాదాలను నమ్ముకుంటే ఏ దిగులూ ఉండదు, జీవుడు తను తనుగా ఉండగలుగుతాడు. కష్టసుఖాలు రెండూ కూడా దరిచేరవు. సమభావన. ఆ స్థితిలో అంతా సచ్చిదానందమే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
మనిషి ఆలోచ నా విధానాన్ని,అతడి నడవడిని ప్రభావితం చేసేది భగవంతుని ప్రేరణ మాత్రమే. అసలు మనిషి పుట్టుకే అత డి చేతిలో లేనపుడు అతడు చేసే పనులకు అతడు ఎలా కారణం అవుతాడు?
ReplyDeleteఈ ప్రశ్నకు జ్ఞానులు చెప్పే కారణం ఒక్కటే.సృష్టి చేసింది భగవంతుడై నా యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని మనిషి కి ఇవ్వటం వలన అతడి చేతలకు అతడే భాద్యుడు